Monday, August 13, 2007

గ్రామ సింహం - ఒక కథ

నాకు గ్రామ సింహాలంటే...చిరాకా, భయమా, అసహ్యమా....కాదు అన్నీ కలిపి. నేను రాత్రుళ్ళు, హైదరాబాదు నుండి మా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తోడుగా (ప్రాణాలు తోడుతూ) బస్ స్టాండ్ నుండి వచ్చేవి. ఒక సారి మా నాన్నను కరిచినప్పటి నుండీ నాకు వాటిపై అవ్యాజమైన అ(సహ్యం)చి(రాకు)భ(యం) ఇంకా పెరిగింది.

అమెరికా వచ్చిన కొత్తలో...విశ్వా అడవి (woods) చూడడానికి వస్తావా అని అడిగితే, విక్రాంత్ పటేల్, నేను ఎగేసుకొని పోయినం. అమెరికాలో అడవి ఎలా ఉంటుందో చూద్దామని. మన దేశంలో కంటే అందంగా ఉంటుందేమోనని ఏదో కుతూహలం (దీన్నే కొన్ని ఏరియాల్లో గుల (దూల) అంటారు).

మైక్ అని తెల్ల సోదరుడు...వాడి కార్లో, మైక్ డ్రైవింగ్ సీట్లో, విశ్వ వాడి పక్క సీట్లో...వెనక సీట్లో విక్రాంత్, నేను, ఇంకా రెండు శునక రాజాలు (ఒకటి మైక్ ది, ఇంకొకటి వాడి మిత్రురాలిది.....ఆ అమ్మాయి ఊరు వెలుతూ వీడిని కాపలా ఉంచింది...ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో)...ఇక్కడ కొందరిని are you single అంటే ...I have a dog అనో I have a cat అనో చెబుతారు। ఆ రెండు శునక రాజాలు...వైయెస్సూ...చంద్రబాబు లా...ఎప్పుడూ కొట్లాడుకుంటాయి। నిన్ను కడిగేస్తానివాల.... అని నాలుక తో కడిగేసుకుంటాయి(ప్రేమతో కాదు)। చివరికి, ఆ తొక్కలో అడవి చూసి చచ్చి చెడి ఎలాగో ఇల్లు చేరినం।

మొన్న ఈ మధ్య మా ఆఫీసు మీటింగ్ ఉంటే, కాలిఫొర్నియా వెళ్ళాల్సి వచ్చింది। మధ్యలో ఒక ఫ్లైట్ మారాలి. అక్కడినుండి నేను వెళ్ళాల్సిన ఊరు ఒక గంట ప్రయాణం. అదో చిన్న విమానం. నాది చిట్ట చివరి సీటు. మన సిటి బస్ లో లాగ ఒకవైపు సింగిల్ సీటు, మరో వైపు ఇద్దరు కూర్చునే విధంగా డబుల్ సీటు. నా పక్కన డబుల్ సీటు లొ ఒక అమెరికన్ అమ్మాయి, దాని పెంపుడు శునకం. ఈ మధ్యనే పెట్స్ ని అనుమతిస్తున్నారట. మా ముందు సీట్లో ఉన్న వృధ్ధ దంపతులు॥ఆరా తీస్తే తెలిసింది. ఆ కుక్క బొచ్చు, ఆ అమ్మాయి టి-షర్ట్ కి అంటితే పీకి విమానం లోనే పడేస్తుంది, నాకప్పుడు బ్రహ్మనందం డైలాగ్ "నా మొహమ్మీద కాకి రెట్టెయ్య" టైపులో..."నా మొహమ్మీద కుక్క బొచ్చెయ్య" అనాలనిపించింది.

మా మామయ్య, వాళ్ళ స్నేహితుని అమ్మ గారు చనిపోతే పలకరించడానికి వెళ్లారు. ఆయన సింపుల్ గా పెద్దావిడ, వయసొచ్చింది, పోయారండి అని, వాళ్ళ కుక్కని వాకింగ్ కి తీసుకెళ్ళారట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెంపుడు కుక్కే ముఖం పై కరిచింది...పాపం ఈయన ముద్దు పెట్టుకోబొయాడట.

ఆ మధ్య కోటి కాలేజ్ లో స్టుడెంట్స్ ని కుక్కలు కరిస్తే పట్టించుకునే దిక్కులేకుండా పొయింది. మన అమల గారేమో ఇప్పుడు వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స లు చేయిస్తుంది. ఇంతకు ముందు పిచ్చి కుక్కలని చిత్తకార్తె లో మునిసిపాలిటీ వాళ్ళు చంపే వాళ్ళు, మనుషులని కరవకుండా. మనుషుల ప్రాణాలు కుక్కల కంటే హీనమయ్యాయా?

గమనిక: పెంపుడు కుక్కలతో మూతులు ము.. నాకించుకునే వాళ్లు నన్ను క్షమించండి.
ముందు మనుషుల్ని మనుషులుగా చూడడం నేర్చుకుందాం...తర్వాత జంతువుల సంగతి

5 comments:

Srini said...

మీ టపా చదువుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. అందులో హాస్యంతో పాటూ మీరు పడ్డ భాధలు, ఇంక చివర్లో మీరు చెప్పిన మాటలు నన్ను కూడా ఆలోచింపచేసాయి.

Unknown said...

చాలా బాగా వ్రాశారు.

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది

www.jalleda.com

జల్లెడ

రాధిక said...

nenu miitoa 100% eakiibhavistaanu.

ప్రియమైన నీకు......... said...

శ్రీనివాస్, జాలయ్య, రాధిక గార్లకు,

ధన్యవాదములు

Unknown said...

భలే తమాషాగా రాశారు,

మీరు బ్లాగులు రాయత్లేదా ....

రాయండి

మీ తిప్పలు సరదాగా ఉన్నాయి ...